విద్యుత్ మీటర్ రీడర్ల సమ్మె
చేర్యాల(సిద్దిపేట): న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్లు ఆదివారం నుంచి సమ్మె బాటపట్టారు. స్పాట్ బిల్లింగ్ పనులు నిలిపివేసి చేర్యాల, మద్దూరు, దూళ్మిట్ట, కొమురవెల్లి మండలాల మీటర్ రీడర్స్ అంతా స్థానిక సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమపై యాజమాన్యం పనిభారం పెంచి వేధిస్తోందన్నారు. మీటర్ రీడర్స్ కార్మికులకు జీఓ 11ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఎన్పీడీసీఎల్ తరహలో 30రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీటర్ రీడర్లు నజిరుద్దీన్, రాజు, శివ, సందీప్, అలీం, సిద్దు, వంశీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


