కేసీఆర్‌కు ఆహ్వానం
మర్కూక్(గజ్వేల్): మండల పరిధి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను నాచారం ఆలయ ట్రస్ట్ మాజీ చైర్మన్ హన్మంతరావు ఆదివారం కలిశారు. ఈ నెల 6న జరిగే తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని వివాహ పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యోగాతోనే ఆరోగ్యం
హుస్నాబాద్‌రూరల్: నిత్యం యోగాసనాలు వేస్తే ఆరోగ్యంగా ఉంటారని శిక్షకురాలు అయిలేని అనిత అన్నారు. పట్టణంలోని ధర్మవీర్ యోగ కేంద్రం ద్వితీయ వార్షికోత్సం పురస్కరించుకుని ప్రత్యేక యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తనువును, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఏకై క సాధనం యోగా అన్నారు. యోగాసనాలతో వ్యాయామం జరుగుతుందన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.
ఆర్టీసీ కార్గో ద్వారా
భద్రాద్రి తలంబ్రాలు
సిద్దిపేటకమాన్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు అందించనున్నట్లు ఆర్టీసీ డీఎం భవభూతి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను డీఎం ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో ద్వారా రూ.151 చెల్లించి భక్తులు బుక్ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దకే అందిస్తామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అమరుల త్యాగాలు వృథా కావు
తూప్రాన్: ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల త్యాగాలను కొనియాడారు.


