వారికి ఓటేస్తే ఐదేళ్లు నరకమే
● ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది
● హుస్నాబాద్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్
హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే ఐదేళ్లు నరకం చూస్తారని, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై బండి సంజయ్ మాట్లాడుతూ... ఎల్కతుర్తి నుంచి సిద్దిపేటకు జాతీయ రహదారితో పాటు అమృత్, స్వచ్ఛ భారత్ ఇలా అన్నిరకాలుగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామన్నారు. పదేళ్లు మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ నాయకులు దోచుకొని అభివృద్ధి గూర్చి పట్టించుకోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నన్ను కోసి వండుక తిన్నా ఒక్క పైసా లేదని చెప్పారని, మరీ మీకు పైసలు ఎవరు ఇయ్యాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోయేటోడులాగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్‌కు నా నిధుల నుంచి కమ్యూనిటి హాల్స్, బడులు, గుడులకు డబ్బులు ఇచ్చానని, వందలాది బోర్లు వేయించానని చెప్పారు. గుణవంతులైన మా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు నరకం చూస్తారన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ సంగప్ప, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు దొడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి అశోక్, నరేశ్ తదితరులు ఉన్నారు.


