నేటితో పుర ప్రచారానికి తెర
చివరి రోజు ప్రచార సభలు, ర్యాలీలకు ప్లాన్
●పోటాపోటీగా జన సమీకరణ ●ఐదు రోజులుగా హోరాహోరీగా ప్రచారం
72 వార్డులు..
326 మంది అభ్యర్థులు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో దుబ్బాకలో 20 వార్డులకు 102 మంది అభ్యర్థులు, గజ్వేల్‌లో 20 వార్డులకు 88 మంది, హుస్నాబాద్ 20 వార్డులలో 92 మంది, చేర్యాలలో 12 వార్డులలో 44 మంది కలిపి మొత్తం 72 వార్డులలో 326 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. దీంతో చివరి రోజు అభ్యర్థులు ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. కీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు.
– దుబ్బాక
జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేడు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వివేక్, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు మంత్రులు ప్రచారం చేపట్టనున్నారు. బీజేపీ అభ్యర్థుల కోసం ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, అరవింద్ ప్రచారం చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రచారం
ఇప్పటికే గత ఐదు రోజులుగా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా దుబ్బాకలో జరిగిన సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హుస్నాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, గజ్వేల్‌లో ఎంపీలు, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, అరవింద్ ప్రచార సభల్లో పాల్గొన్నారు. దుబ్బాకలో మంత్రి వివేక్, హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్, చేర్యాలలో సీతక్క, గజ్వేల్‌లో అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గజ్వేల్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, దుబ్బాకలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సతీశ్ విస్తృతంగా పర్యటించారు.


