
వారిపై రాజద్రోహం కేసు నమోదు చేయండి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి
గిరిజనుల వినతి
హుస్నాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెల్లం వెంకట్రావ్, సోయం బాపురావులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకుడు గుగులోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిసి వినతి పత్రం సమర్పించారు. భారత రాజ్యాంగం రిజర్వేషన్ 342 ప్రకారమే లంబాడి జాతిని ఎస్టీ జాబితాలో కలిపారన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న లంబాడి, కోయ జాతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.
గజ్వేల్: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ మృతి చెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వజ్రమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి స్వగ్రామం జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌లో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వజ్రమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు నేతలు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు సంతాపం తెలిపారు.
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్‌రెడ్డి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో గురువారం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇంటర్ విద్య బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ అదిత్య ప్రత్యేక చొరవతో జూనియర్ కళాశాలలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కార్పొరేట్‌కు దీటుగా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుల సేవలను వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. ఈ సందర్భంగా గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యాపకులను సన్మానించారు.

వారిపై రాజద్రోహం కేసు నమోదు చేయండి