
రైతు బాంధవుడు కేసీఆర్
● ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
● కొండపోచమ్మ సాగర్‌పై బీఆర్‌ఎస్ నేతల ర్యాలీ
మర్కూక్(గజ్వేల్): రైతును రాజుగా చూడాలనుకున్న ఏకైక నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండపోచమ్మ సాగర్ వద్ద గురువారం బీఆర్‌ఎస్ నేతలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ గోదావరి జలాలను బీడు భూములకు పారించి రైతుల కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను రైతుల పొలాలకు పారించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్‌పై కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జెడ్పీటీసీ రాంచంద్రం యాదవ్, వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.