
వరద గుప్పిట్లో జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో పట్టణాలు, గ్రామాలు జనజీవనం అతలాకుతలం నిలిచిన రాకపోకలు కొమురవెల్లిలో 20.6సెంటీమీటర్ల వర్షం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణం
వామ్మో.. ఇదేమి వాన.. ఆకాశానికి చిల్లులుపడ్డట్లు.. ఏకధాటిగా కుంభవృష్టి కురవడంతో జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్లు, పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో జనం బిక్కుబిక్కు మంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిస్థితి దయనీయంగా తయారైంది.
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పలు గృహాలు కూలిపోయాయి. సిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు జలమయంగా మారాయి. పలు చోట్ల రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకనియోజకవర్గాలతో పాటు పలు మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది. కొమురవెల్లి మండలంలో అత్యధికంగా 20.6 సెంటీమీటర్లు, దౌల్తాబాద్‌లో 20 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సిద్దిపేట పట్టణంలో నీట మునిగిన కాలనీలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, కలెక్టర్ హైమావతిలు పరిశీలించారు.
7వేల ఎకరాల్లో పంట నష్టం
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా 3,209 రైతులకు చెందిన 7,335 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఎక్కువగా నష్టపోయాయి. జిల్లాలో 74 గృహాలు నేలమట్టం అయ్యాయి. దీంతో వీరిని ఇతర ప్రాంతాలల్లో ఆశ్రయం పొందుతున్నారు.
250 విద్యుత్ స్తంభాలు నేలమట్టం
జిల్లా వ్యాప్తంగా 250 విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. అలాగే 25 ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ అయ్యాయి. ఐదు కిలో మీటర్ల మేర విద్యుత్ వైర్ ధ్వంసమైంది. దీంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది పలు చోట్ల వర్షాన్ని సైతం లెక్కచే యకుండా విద్యుత్ లైన్ మరమ్మత్తులు చేసి విద్యుత్‌ను సరఫరాను అందించారు. మిరుదొడ్డి, అక్బర్‌పేట–భూంపల్లి, బెజ్జంకి మండలాల్లో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరాను కొనసాగించారు. ఈ వర్షాలకు విద్యుత్ శాఖకు దాదాపు రూ35లక్షల వరకు నష్టం వాటిల్లింది.
బయట పడిన అధికారుల నిర్లక్ష్యం
సిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు జలమయం కావడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పట్టణంలో నాళాలు ఆక్రమించిన సైతం మున్సిపల్ అధికారులు, నీటీ పారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదు. అలాగే కాలనీల్లో సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేసిన సైతం కాసులకు ఆశపడి పట్టించుకోలేదు. దీంతో వర్షాలకు నీట మునిగే పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపించారు.
ముంచెత్తిన వానలు