
వరద ఉధృతిని తట్టుకునేలా ప్రణాళికలు
సిద్దిపేటజోన్: భవిష్యత్‌లో వరద ఉధృతిని తట్టుకునేలా సాంకేతిక పర నిపుణులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. భారీ వర్షాలతో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలను గురువారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు. కోమటి చెరువు నీటిమట్టం దాటి ఉప్పొంగుతున్న వరద నీటి ప్రవాహన్ని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, హరిప్రియనగర్, శ్రీనివాస్ నగర్ కాలనీల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అధికారులతో చర్చించారు. భవిష్యత్‌లో కోమటి చెరువు ఉధృతి పెరిగినప్పటికి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
20 ఏళ్లలో ఇంత వరద రాలేదు..
గతంలో ఎన్నడూ లేనట్లు ఈసారి భారీ వరద వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనట్లు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో 10 సెంటీమీటర్లు, ఎగువ భాగంలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైందన్నారు. కోమటి చెరువు మత్తడి ద్వారా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయన్నారు. సమస్య పరిష్కారం కోసం నర్సాపూర్ చెరువు కొంత భాగం తొలగించి నీటిని శనిగరం,మందపల్లి చెరువులకు మళ్ళించి వరద ఉధృతిని తగ్గించినట్టు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని, నాళాలు కబ్జాలు చేసి, సెట్‌బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి సమయంలో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు