
పండుగరోజూ పడిగాపులే
దుబ్బాకటౌన్/మిరుదొడ్డి(దుబ్బాక)/కొండపాక(గజ్వేల్)/నంగునూరు(సిద్దిపేట):: వినాయక చవితి పండుగ రోజూ, మరోవైపు జోరువానలోనూ రైతులకు యూరియా పాట్లు తప్పలేదు. బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు పడ్డారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసి ముద్దవుతూనే గొడుగులు పట్టుకుని క్యూ కట్టారు. యూరియా లభించినా వర్షంలో తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందని తెలియడంతో వేల సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరు ఉంటే ఒక బస్తా, దంపతులు లైన్‌లో ఉంటే రెండు సంచులకు టోకెన్లు లభించడంతో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న యూరియా లారీ వద్దకు పరుగులు తీశారు. యూరియా పంపిణీ కోసం ఇటు పోలీసులు, అటు వ్యవసాయ అధికారులు సైతం వర్షంలోనూ విధులు నిర్వహించారు. కొండపాక, మండలాల్లోనూ ఇదే దుస్థితి కనిపించింది. నంగునూరు ఆగ్రోసేవా కేంద్రం ఎదుట రైతులు తెల్లవారు జామునే వచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయ కుండా రాత్రి వరకు నిరీక్షించారు. తీరా 500 బస్తాలు రావడంతో చాల మందికి యూరియా దొరకలేదు. ఇదే సమయంలో ఏఓ గీత అక్కడికి చేరుకోవడంతో కారును అడ్డగించి వాగ్వాదానికి దిగారు.
రోడ్డెక్కిన రైతన్న
గురువారం దుబ్బాక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వస్తుందని తెలిసి ఉదయాన్నే వచ్చి క్యూ కట్టారు. యూరియా లారీ రాకపోవడంతో దుబ్బాక ఛత్రపతి సర్కిల్‌లో జోరువానను సైతం లెక్క చేయకుండా ధర్నా చేశారు. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున రోడ్డు పై నిలిచిపోయాయి.
యూరియా కోసం బారులు
వర్షంలోనూ రైతుల పాట్లు

పండుగరోజూ పడిగాపులే

పండుగరోజూ పడిగాపులే