
వాగులో చిక్కుకున్న రైతులు..
కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
దుబ్బాక/ దుబ్బాకరూరల్: భూంపల్లి–అక్బర్‌పేట మండలం చిన్ననిజాంపేటకు చెందిన రైతులు శేర్ల రాజు, సుదర్శన్, గోపాల్ బుధవారం ఉదయం తమ పొలాల వద్దకు వెళ్లారు. తీరా భారీ వర్షం కురవడంతో పోతారెడ్డిపేట పెద్ద చెరువుతో పాటు కూడవెల్లి వాగు ఉధృతం కావడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు. మధ్యలో చిక్కుకున్న వారిని భయటకు తెచ్చేందుకు సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, సీఐ శ్రీనివాస్‌తో పాటు గ్రామస్తులు బుధవారం సాయంత్రం నుంచి ప్రయత్నాలు చేశారు. గురువారం ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం మధ్యలో చిక్కుకున్న ముగ్గురు రైతులను సురక్షింతగా భయటకు తీసుకరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తొగుట మండలం చందాపూర్ గ్రామంలోకి కూడవెల్లి వాగు నీరు చేరింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద చెరువునీరు రోడ్డుపై ప్రవహించడంతో గజ్వేల్–మిరుదొడ్డి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అకారం వద్ద బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో ఆకారం–బీబీపేట మధ్య, అలాగే చిన్ననిజాంపేట గ్రామానికి, భూంపల్లి–ఖాజీపూర్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వాగులో చిక్కుకున్న రైతులు..