
ముఖంచూపని ఉపాధ్యాయులు
● ఈ నెల 18న వినియోగించుకోని 700 మంది
● ఆలస్యంగా వచ్చిన వారు సైతం అదే దారిలో..
● జిల్లా వ్యాప్తంగా 5,649 టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్
ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్ ద్వారా అటెండెన్స్‌ను నమోదు చేసుకునేందుకు పలువురు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. డుమ్మాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను తీసుకువచ్చిన విషయం విదితమే. ఈ నెల ఒకటి నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను అమలు చేస్తున్నారు. ఒక్కరోజే 700 మంది ఉపాధ్యాయులు యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోకపోవడం గమనార్హం. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో పలు కఠిన చర్యలు తీసుకుంటేనే ఉపాధ్యాయులు గాడిలో పడే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. – సాక్షి, సిద్దిపేట
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బోధనా తరగతులు సమతుల్యంగా జరగడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని భావిస్తోంది. పలువురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొడుతూ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. దీంతో క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరై కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ అటెండెన్స్‌ను అమలు చేస్తోంది.
5వేల మందికి పైగా ఉపాధ్యాయులు
జిల్లా వ్యాప్తంగా 1,021 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5,649 మంది ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. వారిలో 5,555 మంది ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. మరో 94 మందిలో ఇతర దేశాలకు వెళ్లిన వారు 63 మంది వరకు ఉండగా 31 మంది వివిధ కారణాలు చెబుతూ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం లేదు. ఉపాధ్యాయుడు, నాన్‌టీచింగ్ సిబ్బంది సదరు పాఠశాలకు 500మీటర్ల లోపు ఉంటేనే ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ తీసుకుంటుంది.
యాప్‌పై కానరాని ఆసక్తి
ఈ నెల 18న 700 మంది ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అటెండెన్స్‌ను వేసుకోలేదు. ఇందులో కొంత మంది సెలవులు పెట్టినా హెచ్‌ఎం ఆమోదం తెలపకపోవడంతో వారందరికీ గైర్హాజరుగా నమోదైంది. మరికొందరు పాఠశాలకు ఆలస్యంగా రావడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకోలేదు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినట్లు తెలిసిపోతుందని ఆటెండెన్స్ వేసుకోవడంలేదు. వర్కింగ్ డేస్‌లలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4:15గంటల వరకు పాఠశాలలోనే ఉపాధ్యాయులు ఉండాలి. కొందరు ముగింపు సమయం కంటే ముందే వెళ్తుంటారు. అలాంటి వారు సైతం ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసేందుకు మొగ్గు చూపడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అటెండెన్స్‌ను వేయని వారిని మొదటే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటే అందరూ క్రమం తప్పకుండా వినియోగించుకుంటారన్న చర్చ జరుగుతోంది. నిర్దేశిత సమయంలో పాఠశాలలోనే ఉండి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే అవకాశం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అభిప్రాయ పడుతున్నారు.
వారిపై చర్యలు తప్పవు
హాజరైన ప్రతి రోజు అటెండెన్స్ ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే నమోదు చేసుకోవాలి. యాప్‌ను ఉపయోగించని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అందరూ సమయ పాలన పాటించాలి. మరో వారం రోజుల్లో ట్రయల్ రన్ ముగియనుంది. కొన్ని చోట్ల టెక్నికల్ సమస్య వస్తుంది. పరిష్కారం చేస్తున్నాం. – శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ

ముఖంచూపని ఉపాధ్యాయులు