
యూరియా ఇవ్వకుండా
కేంద్రం నాటకాలు
దుబ్బాక: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ మండిపడ్డారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కార్యకర్తల కష్టసుఖాలు తెలుసు కున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకాలు చేస్తోందన్నారు. 7 లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉంటే కేవలం 4 లక్షల టన్నులే ఇచ్చిందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనన్నారు. కానీ కొన్నిపార్టీల నాయకులు కావాలనే యూరియాను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కొరత ఉంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ధర్నా చేయడం ఏమిటని ధమ్ముంటే ఢిల్లీలో చేయాలన్నారు. యూరియా కొరతపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ.. తెప్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. సన్నవడ్ల బోనస్ డబ్బులు వచ్చే నెలలో వేయడం జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని ఇప్పుడు అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వడం జరుగుతోందన్నారు.
శ్రీనివాస్‌రెడ్డికి పదవి నా బాధ్యత
మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డికి పదవి ఇప్పించే బాధ్యత నాదేనని మంత్రి వివేక్ అన్నారు. సముచితమైన పదవి ఇవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
అసంపూర్తి పనులు పూర్తి చేస్తాం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అసంపూర్తిగా ఉన్న రహదారులను పరిశీలించి పూర్తి చేస్తామని, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ వెళ్తూ సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీని అభివృద్ధి చేస్తూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ హరికృష్ణ, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్, సందబోయిన పర్శరాములు పాల్గొన్నారు.
కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
దుబ్బాకలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం