డీలర్ల పరేషన్‌! | - | Sakshi
Sakshi News home page

డీలర్ల పరేషన్‌!

Aug 21 2025 11:53 AM | Updated on Aug 21 2025 11:53 AM

డీలర్ల పరేషన్‌!

డీలర్ల పరేషన్‌!

మారిన నిబంధనలతో..

సిద్దిపేటజోన్‌: లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం అందించిన డీలర్లు సంబంధిత కమీషన్‌ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదు నెలలుగా కమిషన్‌ డబ్బులు రాకపోవడంతో దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. రేషన్‌ డీలర్లకు క్వింటాలుకు రూ.140 చొప్పున ప్రభుత్వం కమీషన్‌ చెల్లిస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని డీలర్లకు ఐదు నెలలకు సంబంధించి రూ.3 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గతంలో ఉన్న నిబంధనలను సవరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్‌ డబ్బులు జమ చేసే విధానం రావడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

జిల్లాలో 685 రేషన్‌ షాప్‌ల ద్వారా 2,98,985 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా దాదాపు 5వేల మెట్రిక్‌ టన్నులపై చిలుకు రేషన్‌ బియ్యం సరఫరా అవుతోంది. అందుకు సంబంధించి ఆయా రేషన్‌ షాప్‌ నిర్వహకులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.140 చొప్పున కమిషన్‌ చెల్లిస్తుంది. జిల్లాలో 685 రేషన్‌ డీలర్లకు 51 వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీకి సంబంధించి ప్రతి నెలా సుమారు రూ.71లక్షల పై చిలుకు కమిషన్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గత మార్చి వరకు సజావుగా కమిషన్‌ డబ్బులను బ్యాంకులో జమ చేసింది. కాగా ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి కమిషన్‌ డబ్బులు పెండింగ్‌లో ఉండడం మరోవైపు ఇటీవల జూన్‌లో మూడు నెలల బియ్యాన్ని డీలర్లు ఒకేసారి పంపిణీ చేశారు. దీనితో మొత్తంగా ఐదు నెలల కమిషన్‌ డబ్బులు పెండింగ్‌లోపడ్డాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో డీలర్లు

ఐదు నెలలుగా కమీషన్‌ డబ్బులు జమ చేయకపోవడంతో డీలర్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నారు. షాప్‌ కిరాయి, లబ్ధిదారులకు బియ్యం అందించడానికి అవసరమైన సిబ్బంది జీతం, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి లారీల్లో వచ్చిన బియ్యాన్ని రేషన్‌ షాప్‌ లో దిగుమతి చేసిన హమాలీలకు చార్జీల చెల్లింపు తదితర ఆర్థిక పరమైన అంశాల్లో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వెంటనే జమ చేయాలి

కొన్ని నెలలుగా ప్రభుత్వం కమీషన్‌ డబ్బులు జమ చేయడం లేదు. ఇప్పటివరకు ఐదు నెలలుగా బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రతి నెలా ఒకటవ తేదీనే కమీషన్‌ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కమీషన్‌ను పెంచాలి.

– నాగరాజు,

రాష్ట్ర డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు

గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కమీషన్‌ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే జమ చేసేది. కానీ ఇటీవల నిబంధనలను సవరించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా డీలర్లకు కమిషన్‌ డబ్బులు జమ చేస్తున్నాయి. కమిషన్‌ డబ్బుల జమ అంశంపై డీలర్లకు అయోమయ పరిస్థితి నెలకొంది.

కమీషన్‌ కోసం ఎదురుచూపులు

ఐదు నెలలుగా పెండింగ్‌

జిల్లాలో రూ.3కోట్ల బకాయిలు

కొత్త నిబంధనలతో అయోమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement