
మల్లన్నసాగర్ టు కొండపోచమ్మ సాగర్
నీటి పంపింగ్ ప్రారంభం
మర్కూక్(గజ్వేల్): భారీ వర్షాల నేపథ్యంలో మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్‌కు బుధవారం నీటిపంపింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ సాయిరెడ్డి మాట్లాడుతూ ఒక పంపు ద్వారా ప్రస్తుతం కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు. వరద ఉధృతి మేరకు మిగతా పంపు లను కూడా ప్రారంభిస్తామన్నారు. మంగళవారం నాటికి కొండపోచమ్మసాగర్‌లో 4.78 టీ ఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. 12 టీఎంసీల వరకు పంపింగ్ చేస్తామన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు అర్హులన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు 15 ఏళ్లు, ఉపాధ్యా యులు పదేళ్ల ఉద్యోగ నిర్వహణ చేసిన వారు దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 25లోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
గజ్వేల్: జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి బుధవారం గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్వహణను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట గజ్వేల్ ఏడీఏ బాబునాయక్ ఉన్నారు.
సిద్దిపేటరూరల్: ‘ఇందిరమ్మ ఇళ్లలో అధికారుల చేతివాటం’ అనే శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ స్పందించారు. సంబంధిత అధికారిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక అందించాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): రైల్వే లైన్‌పై ఆ శాఖ అధికారులు బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల్లో భాగంగా ట్రయల్ రన్ చేపట్టారు. మొదటి సారి రైలు కూత వినిపించడంతో స్థానికులు సెల్ఫీలు దిగారు. చిన్నకోడూరుకు రైలు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
రాజీవ్‌గాంధీకి ఘన నివాళి
గజ్వేల్: ప్రపంచ దేశాల్లో భారత్‌ను తలెత్తుకునేలా చేసిన దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ చరిత్రను చెరిపేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆరోపించారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా బుధవారం గజ్వేల్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ సాంకేతిక రంగాలకు పెద్ద పీట వేశారని కొనియాడారు.