
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి
● అధికారులతో సమీక్ష
హుస్నాబాద్: నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈజీఎస్ కింద చేపడుతున్న పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్ర భవనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. నేషనల్ హైవే పనుల్లో భాగంగా పోతారం(ఎస్), పందిల్ల, జిల్లెల్లగడ్డ, సముద్రాల, బస్వాపూర్ వద్ద సెంట్రల్ లైటింగ్ పనులు చేయాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులు, బతుకమ్మ ఘాట్‌ను బతుకమ్మ పండుగ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని పక్కా ప్రణాళికతో నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా హౌసింగ్ అధికారులు సందర్శించాలన్నారు. మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం టార్గెట్ పూర్తి చేసి, రహదారుల వెంబడి రావి, మర్రి. వేప చెట్లను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
నంగునూరు(సిద్దిపేట): వరద నీటి ప్రవాహం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చెక్‌డ్యామ్, వాగుల్లో సమస్యలు రాకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం నంగనూరు మండలం పరిధిలోని మోయతుమ్మెద వాగు ఘనపూర్, ఖాతా ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లను పరిశీలించారు. పది రోజులుగా చెక్‌డ్యామ్ ద్వారా నీటి ప్రవాహం ఉంటోందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అప్రమత్తంగా ఉండేలా ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
రేపు ‘పనుల జాతర’
సిద్దిపేటరూరల్: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 22న శుక్రవారం పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పనుల జాతర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం సంబంధిత అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.