
విద్యాభివృద్ధే లక్ష్యం కావాలి
సిద్దిపేటరూరల్: ‘విద్యాభివృద్ధే లక్ష్యం కావాలి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా కృషి చేయాలి. విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలి
అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో ప్రజలు అధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 16, 17వ ఎంపీ నిధుల ద్వారా మంజూరై పూర్తికాని పనులు, నిధుల వివరాలను అందించాలన్నారు. తొగుట మండలంలో ఇరిగేషన్ కాలువల తవ్వకం వల్ల వచ్చిన మట్టి, రాళ్లను ప్రజల ఉపయోగం కోసం కొంత రుసుంతో ఇవ్వాలన్నారు. ఎన్సాన్‌పల్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామన్నారు. దివ్యాంగుల ఉపకరణాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థులతో సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ కల్పించాలన్నారు. దుబ్బాకలో న్యాక్ వారి సహకారంతో ప్రజలు విదేశాలలో కూడా ఉపాధి పొందేలా వివిధ కోర్సులలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే టెన్త్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక బద్ధంగా విద్యాబోధన చేయాలన్నారు.
కమిషనర్ గైర్హాజర్‌పై ఆగ్రహం
సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ దిశా సమావేశానికి రాకపోవడంపై ఎంపీ రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అండర్‌గ్రౌండ్ నిర్మాణానికి అందించిన నిధులు, పనుల వివరాలను చర్చించేందుకు కమిషనర్ రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి
దిశా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్