అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శం
ములుగు(గజ్వేల్): అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే దళితులకు, అణగారిన వర్గాలకు హక్కులు దక్కుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ములుగు మండలం బస్వాపూర్‌లో గురువారం ఎంపీ రఘునందన్ రావుతో కలసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ ఫలమే అన్నారు. ఎంపీ రఘునందన్ రావు మట్లాడుతూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు అంబేడ్కర్ వల్లే వచ్చాయన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అంబేడ్కర్‌పై పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరీ శంకర్ ముదిరాజ్, బీజెపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగంతోనే దళితులకు హక్కులు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


