ఆరో రోజు..@65 | Sakshi
Sakshi News home page

ఆరో రోజు..@65

Published Fri, Nov 10 2023 6:54 AM

- - Sakshi

కొత్త ప్రభాకర్‌రెడ్డి భావోద్వేగం

దుబ్బాకటౌన్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రత్యేక అంబులెన్స్‌లో దుబ్బాకకు చేరుకున్నారు. ప్రచారం చేపడుతుండగా కత్తిపోటుకు గురై తీవ్రగాయాలతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. డాక్టర్ల పర్యవేక్షణలో వచ్చి నామినేషన్‌ వేశారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబులెన్స్‌ విండోలోంచి అభివాదం చేశారు. వారు తన కోసం పడుతున్న తాపత్రయాన్ని చూస్తూ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. మాట్లాడలేక పోయిన ఎంపీ అందరికీ చేతులు జోడిస్తూ దండం పెట్టారు. ఈ సందర్భంగా దుబ్బాక టైగర్‌ ప్రభాకరన్నా అంటూ కార్యకర్తలు, నాయకులు భారీగా నినాదాలు చేశారు. డాక్టర్ల పర్యవేక్షణలో రావడం, కనీసం నడవలేని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న ఆయనను చూసి కార్యకర్తలు నాయకులు సైతం కంటతడి పెట్టడం కనిపించింది.

సాక్షి, సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరో రోజు గురువారం ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌, సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్‌రావు నామినేషన్లు వేశారు. కత్తిపోటుకు గురై నగరంలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక అంబులెన్స్‌లో వచ్చి పత్రాలు అందజేశారు. సిద్దిపేటలో 12 మంది, హుస్నాబాద్‌లో ఆరుగురు, దుబ్బాకలో ఏడుగురు, గజ్వేల్‌లో40 నామినేషన్లు దాఖలయ్యాయి.

నేడు ఆఖరు

ఈ నెల 3నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగియనుంది.

హరీశ్‌రావు నాలుగు సెట్లు..

సిద్దిపేటజోన్‌: సిద్దిపేటలో రిటర్నింగ్‌ అధికారి రమేష్‌ బాబు నామినేషన్లు స్వీకరించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు నాలుగు సెట్లు, బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి ఒక సెట్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి హరికృష్ణ ఒక సెట్‌ దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థులుగా చక్రధర్‌ గౌడ్‌, పెద్ద మ్యాతరి బాబు చెరొక సెట్‌, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి గా బొమ్మల ప్రవీణ్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు.

గజ్వేల్‌లో 40 ..

గజ్వేల్‌: అసెంబ్లీ స్థానానికి 40 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 4సెట్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున ఆయన వర్గీయులు ఒక సెట్‌ దాఖలు చేశారు. ఇవి కాకుండా మిగిలిన 38 మంది స్వతంత్ర అభ్యర్థులుగా, వివిధ పార్టీల నుంచి పత్రాలు దాఖలు చేశారు. ఈ విషయాన్ని గజ్వేల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బన్సీలాల్‌ తెలిపారు.

హుస్నాబాద్‌లో ఆరు..

హుస్నాబాద్‌: అసెంబ్లీ స్థానం నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి బెన్‌ షాలోమ్‌ తెలిపారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా అయిలేని మల్లికార్జున్‌ రెడ్డి, కామాద్రి మురళీ, పచ్చిమట్ల రవీందర్‌, మంద నగేష్‌, పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (డెమోక్రటిక్‌) నుంచి సుంకరి వెంకటస్వామి, ఇండియన్‌ ప్రజా బంధు పార్టీ తరఫున నాగభూషణం నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

దుబ్బాకలో ఏడు..

దుబ్బాకటౌన్‌: దుబ్బాకలో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయని ఆర్‌ఓ గరీమా అగ్రవాల్‌ తెలిపారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌) 2 సెట్లు, సలకం మల్లయ్య,(బీఎస్‌పీ) రెండు సెట్లు, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌), విజయ్‌కుమార్‌ (ఆబాద్‌ పార్టీ), గుండుకాడి కరుణాకర్‌ (ప్రజాబంధు పార్టీ) తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.

వెల్లువెత్తిన నామినేషన్లు

ప్రముఖుల దాఖలు

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌, సిద్దిపేటలో హరీశ్‌ రావు..

అంబులెన్స్‌లో వచ్చి దుబ్బాకలో ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి..

నేటితో ముగియనున్న స్వీకరణ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement