సమస్యల చెంత.. వారసంత | - | Sakshi
Sakshi News home page

సమస్యల చెంత.. వారసంత

Mar 16 2026 8:56 AM | Updated on Mar 16 2026 8:56 AM

హుస్నాబాద్‌: సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాలోనే అతి పెద్ద సంత (అంగడి). గుండు పిన్నీసు నుంచి మొదలుకొని ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు ఈ సంతలో దొరుతుంది. వీటితో పాటుగా పశువుల క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. అతిపెద్ద సంత అసౌకర్యాలకు నిలయంగా మారింది. హుస్నాబాద్‌ పట్టణంలో ప్రతి శుక్రవారం వారసంత జరుగుతుంది. తాజా కూరగాయలు, ఉప్పు, పప్పు, మాల్‌ మసాల ప్రతి వస్తువు చౌకగా లభిస్తాయి. రైతులు పండించిన పంటలను సైతం ఇక్కడ అమ్ముకుంటారు.

రోడ్లపైనే విక్రయాలు..

సంత నిర్వాహణకు సొంత స్థలం లేకపోవడంతో రోడ్ల పైనే కూరగాయల క్రయ విక్రయాలు జరుపుతారు. చిరు వ్యాపారులు ఎండకు ఎండుతూ, వానకు నానుతూ అష్టకష్టాలు పడుతున్నారు. తాగడానికి మంచి నీళ్లు, నీడ సౌకర్యం లేకున్నా చిరు వ్యాపారుల నుంచి గుత్తెదారులు జబర్దస్త్‌గా రుసుం వసూలు చేస్తారు. దాదాపు 50 ఏళ్లుగా రోడ్ల పైనే వారసంత నిర్వాహణ కొనసాగుతోంది. ఈ అంగడి ద్వారా మున్సిపల్‌కు లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యలపై అధికారులు దృష్టిసారించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెరువు కట్ట కింద పశువుల సంత..

హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట కింద పశువుల క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. హైదరాబాద్‌, సిద్దిపేట, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల నుంచి పశువుల వ్యాపారులు, రైతులు వస్తుంటారు. వారసంత రోజు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వందలాది వాహనాల్లో పశువులను కొనుగొలు చేసి పట్టణాలకు తరలిస్తారు. గొర్రెలు, మేకల సంఖ్యకు లెక్కేలేదు. పశువుల సంతలో గేదే, ఆవు, బర్రెలు కొనుగొలు చేసిన వారి నుంచి, అమ్మిన వారి నుంచి రూ.250 చొప్పున రుసుం వసూలు చేస్తారు. వందలాది మంది వ్యాపారులు, రైతులకు కనీస నీడ సౌకర్యం లేదు. నామికే వస్తేగా చిన్నపాటి షెడ్డును నిర్మించారు. వేల సంఖ్యలో వచ్చే పశువుల కోసం ఒకే ఒక్కటి నీటి తొట్టెను నిర్మించారు. వ్యాపారం ముగిసే వరకు చెట్ల కింద సావాసం చేయాల్సి ఉంటుంది. అంగడి సంపాదించే లక్షల రూపాయలు కావాలే కానీ, సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన రాకపోవడం శోచనీయం. కొలువుదీరిన కొత్త పాలకవర్గమైన అంగడిని పట్టించుకొని సౌకర్యాలు కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

గుత్తేదారుల పోటీ..

హుస్నాబాద్‌లో జరిగే వారసంతను దక్కించుకునేందుకు గుత్తేదారులు పోటీ పడుతుంటారు. వివిధ ప్రాంతాల నుంచి గుత్తెదారులు వారసంత వేలంలో పాల్గొంటారు. ఒక్కో గుత్తేదారుడు రూ.10లక్షలు ధరావత్‌ సొమ్ముతో పాటుగా రూ. 5వేలు దరఖాస్తు ఫీజు చెల్లించి వేలంలో పాల్గొంటారు. గత ఏడాది వారసంత రూ.92.20 లక్షలు వేలం పాటపాడారు. ఈసారి ఈ నెల 18న వారసంత వేలం వేయనున్నారు.

ఆదాయం ఫుల్‌.. సౌకర్యాలు నిల్‌

హుస్నాబాద్‌కు

సంత అతిపెద్ద ఆదాయ వనరు

గతేడాది వేలం రూ.92.20లక్షలు

ఈ నెల 18న బహిరంగ వేలం

Advertisement
 
Advertisement
Advertisement