
బాడుగుల చెరువు సమీపంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు
అనుమతి లేకుండానే ప్లాట్లు, నిర్మాణాలు
● ప్రజాప్రతినిధుల అండతోనే వ్యవహారం!
● పట్టించుకోని రెవెన్యూ, జీపీ అధికారులు
● కోహెడ మండల కేంద్రంలో దుస్థితి
కోహెడ(హుస్నాబాద్): ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ, జీపీ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోహెడ మండల పరిసర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో కబ్జా వ్యవహారం జోరుగా సాగుతుంది. అనుమతి లేకుండాలనే ప్రభుత్వ భూముల్లో పలు ప్లాట్లు, నిర్మాణాలు చేస్తున్నారు.
కోహెడ – సముద్రాల రోడ్డు సమీపంలోని సర్వే నంబర్ 768 బాడుగుల చెరువు రికార్డుల్లో 47.36 ఎకరాల విస్తీర్ణం ఉంది. కానీ మోక మీద పట్టుమని పాతిక ఎకరాలు కూడలేదు. సమీపంలోని సర్వే నంబర్లున్న పట్టాదారులు చెరువు భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.
అలాగే కోహెడ నుంచి సముద్రాల ప్రస్తుత దారి కుడి పక్కన ఉన్న సర్వే నంబర్ 1229లో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమి పూర్తిగా అన్యాక్రాంతమైంది. ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఓ ప్రజాప్రతినిధికి రూ.60 లక్షల విలువైన కొంత భూమిని ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఈ రహస్య ఒప్పందంతో కోహెడ పంచాయతీ తీర్మానం ద్వారా భవన నిర్మాణాలకు అనుమతి ఇప్పించినట్లు సమాచారం. అనంతరం ప్రభుత్వ భూములను కబ్జా చేసి భవన నిర్మాణాలతో పాటుగా ఇళ్ల స్థలాలకు ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తునట్లు తెలుస్తోంది.
గతంలో బీపీసీఎల్ సంస్థ పెట్రోల్ బంక్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అక్కడి ప్రభుత్వ భూమిని ఆక్రమించి బంక్ నిర్మాణం చేస్తున్న ఓ యాజమాని నుంచి కూడ పెద్ద మొత్తంలో ముడుపులు ఇప్పించి అదే ప్రజాప్రతినిధి పంచాయతీ పాలకవర్గంతో ఎన్‌ఓసీ ఇప్పించినట్లు విశ్వసనీయ సమాచారం.
అధికారులు పట్టించుకోకపోవడంతోనే రూ.కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమి పరుల పాలవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని.. లేకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని పలు రాజకీయ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించి జిల్లా స్థాయి అధికారులతో సర్వే చేయించి ఆక్రణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలని.. తప్పుడు సర్వే రిపోర్టులతో ప్రభుత్వ భూములను కబ్జాదారుల ద్వారా అన్యాక్రాంతానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారుల పట్టింపు కరువైంది
ప్రభుత్వ భూముల కబ్జాపై మండల అధికారుల పట్టింపు కొరవడింది. కబ్జాకు గురైతున్న భూములను సర్వే చేసి చేయించాలని కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేశాను. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భూములను కాపాడాలి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి.
–వెల్పుల శంకర్, కోహెడ
క్షేత్రస్థాయిలో
విచారణ చేస్తాం
వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తాం. ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి ప్రభుత్వ భూమిని కాపాడుతాం.
–జావిద్ అహ్మద్, తహసీల్దార్, కోహెడ