న్యూస్‌రీల్
రిజిస్ట్రేషన్ చేయకుండానే మ్యూటెషన్.. పాసుబుక్ జారీ! భూ భారతి పోర్టల్‌లో అక్రమ లావాదేవీలపై సీఐడీ విచారణ ఆర్సీపూర్ తహసీల్దార్ నుంచి వివరాల సేకరణ
పాడి వైపు... రైతుల చూపు ఎల్‌నినో కారణంగా సాగు పనులు వదులుకుని రైతులు పాడి వైపు మొగ్గుచూపుతున్నారు. వివరాలు 8లో u
రూ.75 కోట్ల
విక్రయించకుండానే మరొకరిపై పట్టా మార్పు ఎలా సాధ్యం?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రామచంద్రాపురం మండలం పరిధిలో ఉన్న విలువైన భూమి అది. సుమారు రూ.75 కోట్లు విలువ చేసే ఈ మూడు ఎకరాల భూమిని పట్టాదారు విక్రయించలేదు. తహసీల్దార్ రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. కానీ ఈ భూమి మరొకరి పేరుపై మారిపోయింది. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అయినట్లు భూ భారతి పోర్టల్‌లో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి పోర్టల్‌లో జరిగిన అక్రమ లావాదేవీలపై సీఐడీ విచారిస్తోంది. ఈ మేరకు రామచంద్రాపురం తహసీల్దార్ సరస్వతికి నోటీసులు జారీ చేసిన సీఐడీ, ఈ మేరకు తమ కార్యాలయానికి పిలిపించి ఈ అక్రమ లావాదేవీ ఎలా జరిగిందనే అంశంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన భూభారతి అక్రమ లావాదేవీలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ విలువైన భూలావాదేవీపై దర్యాప్తు చేస్తోంది. ఒకరి భూమి మరొకరి పేరుపైకి మారాలంటే జరిగే ప్రాసెస్‌ను తహసీల్దార్ సీఐడీ అధికారులకు వివరించినట్లు సమాచారం.
మూడు నెలల క్రితం
కేసు నమోదు
తమకు తెలియకుండానే..తమ ప్రమేయం లేకుండానే భూభారతి పోర్టల్‌లో ఈ భూ లావాదేవీలు జరిగినట్లు జిల్లా అధికారుల దృష్టికి రావడంతో రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దార్ సరస్వతి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ ట్రాన్సాక్షన్‌పై సీసీఎల్‌ఏకు నివేదిక కూడా ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన సీసీఎల్‌ఏ ఈ కేసును సీఐడీకి బదిలీ చేసి సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఇప్పటికే పలువురు రెవెన్యూ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జిల్లాలో మరికొన్ని చోట్ల..
జిల్లాలో మరికొన్ని మండలాల్లో ఇలాంటి అక్రమ లావాదేవీలు జరిగినట్లు సీఐడీ దృష్టికి వెళ్లింది. వీటిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహరాల్లో రెవెన్యూ అధికారులు గానీ, సిబ్బంది ప్రమేయం ఉందా? లేదంటే అవుట్‌సోర్సింగ్ సిబ్బంది హస్తం ఉందా? అనేదానిపై సీఐడీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాక్ ఎండ్‌లో ఎలా జరిగింది?
ధరణి పోర్టల్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తీసుకు వచ్చిన విషయం విదితమే. ఈ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారుల ప్రమేయం లేకుండానే ట్రాన్సాక్షన్‌లు జరగడం..తహసీల్దార్ థంబ్, డిజిటల్ సిగ్నిచర్ లేకుండానే భూమి మరొకరి పేరుపై మారడం, ఈ మేరకు మ్యూటేషన్ కూడా జరిగి..పట్టాదారు పాసుపుస్తకం జారీ కావడంతో ఈ పోర్టల్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇలాంటి లావాదేవీలు ఎలా జరిగిందనే దానిపై సమగ్ర విచారణ చేపట్టిన సీఐడీ బ్యాక్‌ఎండ్‌లో ఎవరి ప్రమేయం ఉందనే అంశంపై ఆరా తీస్తోంది. ఇందుకోసం ఏదైనా మాల్వేర్‌ను వాడారా అని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.


