● రైతులు, యాజమాన్యాల సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత
జహీరాబాద్: జిల్లాలోని చెరుకు రైతులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేలా కేన్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ సంగీత ఆదేశించారు. కలెక్టరేట్‌లో కేన్ కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం చెరుకు రైతులు, ఆయా కర్మాగారాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి అదనపు కలెక్టర్ సంగీత హాజరై రైతులు, యాజమాన్యాలతో చర్చించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆమె ముందుంచారు. చెరుకు పంటకు రాయికోడ్‌లోని గోదావరి–గంగా, సంగారెడ్డిలోని గణపతి షుగర్స్ యాజమాన్యాలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, పక్క జిల్లాల్లోని కర్మాగారాల యాజమాన్యాలు తమ చెరుకు పంటకు అధిక ధర ఇచ్చేందుకు ముందుకు వస్తున్నా జిల్లాలోని యాజమాన్యాలు మొక్కుబడి ధరను ఇచ్చేందుకు నిర్ణయించాయని రైతులు ప్రస్తావించారు. జోన్ పరిధిలోని చెరుకు పంటను ఇతర జోన్లకు ఎలా తరలిస్తారని యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయ ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని యాజమాన్యాలు టన్నుకు రూ.3,600 ధర చెల్లించి, చెరుకు కోత, రవాణ ఖర్చులను వారే భరిస్తున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గోదావరి–గంగా టన్నుకు రూ.4,050, అరకిలో చక్కెర ఇచ్చేందుకు నిర్ణయించాయని, చెరుకు కోత–రవాణ ఖర్చులు పోను రూ.3,050 మాత్రమే ధర వస్తోందని వివరించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాలు అధిక ధరను ఎలా ఇవ్వగలుగుతున్నాయని, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారని యాజమాన్యాలను ప్రశ్నించారు. ఇందుకు వారు సమాధానమిస్తూ రికవరీ ఆధారంగా కర్మాగారాలు ధరను చెల్లిస్తున్నాయని తెలిపారు. సాధించే రికవరీని ఎవరు నమోదు చేస్తున్నారని, రికవరీ సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మూడు రోజుల్లో చెరుకు ధర విషయాన్ని యాజమాన్యాలు వెల్లడించాలన్నారు. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ కర్మాగారంలో డిసెంబర్ చివరి వారంలో క్రషింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కర్మాగారం ప్రతినిధులు పేర్కొన్నారు. సమావేశంలో కేన్ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్, సీడీసీ చైర్మన్లు ముబీన్, రాంరెడ్డి, రాయికోడ్‌లోని గోదావరి–గంగా, సంగారెడ్డిలోని గణపతి షుగర్స్, మాగి, కామా రెడ్డిలోని గాయత్రి షుగర్స్, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్ కర్మాగారాల యాజమాన్యాలు, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.


