● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్సింహా డిమాండ్ ● సింగూర్ ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్సింహా డిమాండ్ చేశారు. కరువు ప్రభావంతో రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఛలో కలెక్టరేట్ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు ఉపాధి కోల్పోయిన వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సంగారెడ్డి జిల్లాకు జీవనాధారంగా ఉన్న సింగూర్ ప్రాజెక్టు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 28 కరువు ప్రభావిత మండలాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, రైతులు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఘనంగా సదర్ వేడుకలు


