రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ నుంచి ఐలమ్మ విగ్రహం వరకు మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ..కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని, సహకార సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. కౌలు రైతులను ఆదుకునేందు కు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలను జాతీయస్థాయిలో చర్చించేందుకు నిర్వహిస్తున్న మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్‌గౌడ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు
జహీరాబాద్ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన ఏరియా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి పట్ల ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఈ నెల 15న నల్లగొండ బహిరంగ సభకు జహీరాబాద్ ప్రాంతం నుంచి రైతులు తరలిరావాలని ఆయన కోరారు.


