ఇంటెక్‌వేల్‌లోకి రాని నది నీరు
● మోటార్లతో పంపింగ్‌కు ఏర్పాట్లు ● రెండు రోజులకోసారి నీటి సరఫరా
రాయికోడ్(అందోల్): మంజీర నదిలో నీరు అడుగంటుతోంది. ఏటా ఇదే సమయంలో నీటితో కళకళలాడేది. ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. మండలంలోని పాంపాడ్, సిరూర్, మోరట్గా, మామిడిపల్లి, కర్చల్ తదితర గ్రామాల సమీపం నుంచి ప్రవహించే నదిలో బండరాళ్లు తేలడంతో పాంపాడ్ మిషన్ భగీరథ గ్రిడ్‌కు చెందిన ఇంటెక్‌వెల్‌లోకి సాధారణ నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడగా, అధికారులు నదిలోని నీరు ఇంటెక్‌వెల్‌లోకి మళ్లించడానికి పెద్ద కాలువ తీయించారు. కానీ ఫలితం లేకుండా పోకపోవడంతో మూడు పెద్ద మోటార్లను నది నీటిలో దింపి నీటిని పంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి మహబత్‌పూర్ సమీపంలోని పంప్‌హౌస్‌లో నీటిని శుద్ధి చేసి రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
44 గ్రామాలకు తాగునీరు
పాంపాడ్‌లో మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా 44 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. అందులో రాయికోడ్ మండలంలోని 33 గ్రామాలు, మునిపల్లి మండలంలోని 8 గ్రామాలు, ఝరాసంగం మండలంలోని 3 గ్రామాలున్నాయి. నదిలో నీటి లభ్యత ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో నీటి ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మంజీర నది ద్వారా వచ్చే ఏడాది సంక్రాంతి వరకు నీటి సరఫరా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. అనంతరం తలెత్తే ఇబ్బందులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు, ఏఈలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన గ్రామాల్లో అద్దె బోరు, బావులు, ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొత్త బోర్ల తవ్వకం, పాత బోర్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తా మని తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో నీరు వృథా చేస్తే చర్యలు తప్పవని చాటింపు చేయిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రత్యేక ఆదేశాలిచ్చాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఆదేశాలిచ్చాం. తాగునీటి సమస్యలు తతెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేయించాం. నీటి పొదుపుపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాం.
– జగదీశ్, రాయికోడ్ మండల ప్రత్యేకాధికారి


