పటాన్‌చెరు టౌన్: పారిశ్రామిక, రెవెన్యూ పరంగా కీలకమైన పటాన్‌చెరు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు. శనివారం అధికారులతో కలిసి పటాన్‌చెరు, బండ్లగూడలో మార్నింగ్ వాక్ నిర్వహించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన రహదారు లు, కాలనీల్లో చెత్త పేరుకుపోవడం, మురుగు నీటి సమస్య, తాగునీటి సరఫరాలో అంతరాయం, వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బండ్లగూడ గోపాల్‌రెడ్డి కాలనీలో డ్రైనేజీ, పింఛన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. దోషం చెరువు 16 ఎకరాల స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేసినట్లు తెలిపారు. వారంలోగా సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరు సమగ్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.


