నిబంధనలకు పాతర | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు పాతర

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

● యథేచ్ఛగా టపాసుల దుకాణాలు ● చుట్టూ హాస్టళ్లు, కార్యాలయాల సముదాయాలు ● అధికారుల ఉదాసీనత

● యథేచ్ఛగా టపాసుల దుకాణాలు ● చుట్టూ హాస్టళ్లు, కార్యాలయాల సముదాయాలు ● అధికారుల ఉదాసీనత

నారాయణఖేడ్‌: దీపావళి పండగ కోసం ఏర్పాటు చేసిన బాణసంచా (టపాసుల) దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. దుకాణాల ఏర్పాటుకు అవసరమైన నిబంధనలు నిర్వాహకులు పాటించకుండా ఏర్పాటు చేస్తుండడం.. అధికారులు పరిశీలించి మరీ వంత పాడడం విమర్శలకు తావిస్తోంది. నారాయణఖేడ్‌ పట్టణంలోని తహశీల్‌ గ్రౌండ్‌లో 23 టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అలాగే రెండు హాస్టళ్ల సమీపంలోనే ఈ గ్రౌండ్‌ ఉంది. సబ్‌ కలెక్టర్‌ నివాస గృహం ముందే దర్జాగా దుకాణాలు వెలిశాయి. ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, అటవీశాఖ, లైబ్రరీతో పాటు నివాస ప్రాంతాల సమీపంలో ఉన్నాయి. ఈ దుకాణాలకు జిల్లా పోలీస్‌, కలెక్టర్‌ కార్యాలయం నుంచి అనుమతులు పొందాల్సి ఉంది.

దర్జాగా అనుమతులు

పేలుడు పదార్థాల (టపాసుల) దుకాణాలకు మున్సిపల్‌ అధికారులు యథేచ్ఛగా ఎన్‌ఓసీ జారీ చేశారు. నిబంధనలు పాటించాల్సిన అగ్నిమాపక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తారు. రెవెన్యూ, పోలీసులు అధికారులు పరిశీలించి మరీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌, శానిటరీ అధికారి స్వయంగా దుకాణాలను పరిశీలించినా, చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

చర్యలు తీసుకుంటాం

దుకాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐకి సూచించినట్లు డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. తాము కేవలం ఎన్‌ఓసీ మాత్రమే ఇచ్చినట్లు మున్సిపల్‌ శానీటరీ అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది దూరంగా ఏర్పాటు చేస్తామని ఫైర్‌ అధికారి వీరేశం తెలిపారు. ఈ సారి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తే అధికారులు మౌనం పాటించారు.

భారీగా పెరిగిన ధరలు

సంగారెడ్డి క్రైమ్‌: బాణాసంచా మోతలు.. కాకరపూల కాంతులు.. చిచ్చుబుడ్ల జిలుగుల మధ్య దీపావళి జరుపుకుంటారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి టపాకాయల ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా 20 నుంచి 30% మేర పెరగడంతో మధ్య తరగతి ప్రజలు టపాసుల కొనుగోలు తగ్గించారు. సంగారెడ్డి పట్టణంలో చిచ్చుబుడ్ల బాక్సు ధర రూ.200–600, భూచక్రాల బాక్స్‌ సైజును బట్టి రూ.50–300, రాకెట్లు బాక్స్‌ ధర రూ.150–150 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టపాకాయలు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. కాగా, గతంతో పోలిస్తే విక్రయాలు భారీగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement