లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏవో | - | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏవో

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏవో సర్‌ పెండింగ్‌ ఫారాలపై దృష్టి సారించాలి జడ్జి బదిలీ సాహితీసేవా పురస్కారానికి ఐతా చంద్రయ్య ఎంపిక బోర్‌వెల్‌ వాహనం సీజ్‌ 9 మందికి జరిమానా నేడు అధ్యాపక పోస్టుకు ఇంటర్వ్యూ..

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్‌ రేంజ్‌ డీఎస్పీ సుదర్శన్‌ వివరాల మేరకు.. ఓ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్‌ వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగడానికి నిర్వాహకుల నుంచి గత నెల 19న మండల వ్యవసాయాధికారి రమేశ్‌ రూ.30వేలు డిమాండ్‌ చేసి, అదే రోజు రూ.10వేలు తీసుకున్నాడు. కాగా మంగళవారం మరో రూ.20వేలను తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రమేశ్‌ను పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ఆర్డీఓ సదానందం

సిద్దిపేటజోన్‌: సర్‌ ప్రక్రియకు సంబంధించి పెండింగ్‌ ఫారాలన్నింటిని ఈనెల 18లోగా త్వరితగతిన పూర్తి చేయాలని సిద్దిపేట ఆర్డీఓ సదానందం సూచించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్స్‌, సూపర్‌వైజర్స్‌తో సమీక్ష నిర్వహించారు. పెండింగులో ఉన్న ఫారాలు 6,7,8 వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఈ.ప్రమీద బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమీద పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ అయినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అందిస్తున్న డాక్టర్‌ ఎం.ఎల్‌ నరసింహారావు సాహితీసేవా పురస్కారం 2026 సంవత్సరానికి గాను సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవి, రచయిత, కథాశిల్పి ఐతా చంద్రయ్య ఎంపికై నట్లు బాలసాహితీవేత్త రాజేశం తెలిపారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో ఆయన పురస్కారం అందుకోనున్నారని చెప్పారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తూ అనేక ప్రక్రియల్లో రచనలు చేశారని, శతాధిక గ్రంథకర్త అయిన చంద్రయ్య పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా జాతీయ సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి, వరుకోలు లక్ష్మయ్య, బస్వరాజ్‌ కుమార్‌, కాల్వ రాజయ్య, సింగీతం నరసింహారావు, ఉప్పరి బాలచంద్రం, పెందోట వెంకటేశ్వర్లు, డాక్టర్‌ బి.సుధాకర్‌ ఆయనకు అభినందనలు తెలిపారు.

జిన్నారం(పటాన్‌చెరు): అనుమతులు తీసుకోకుండా బోరుబావి తవ్వకం పనులు చేపట్టడంపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం బొల్లారం డివిజన్‌ పరిధిలో ఎలాంటి అనుమతులు పొందకుండా చేపట్టిన బోరు తవ్వకం పనులను రెవెన్యూ అధికారులు అడ్డుకొని బోర్‌వెల్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు. అనంతరం బొల్లారం పోలీసులకు వాహనాన్ని అప్పగించారు. ఇకపై అనుమతులకు విరుద్ధంగా బోరు బావుల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాస్‌, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

పటాన్‌చెరు టౌన్‌ : డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. ఈ ఘటన పటాన్‌చెరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌రావు వివరాల ప్రకారం.. సోమవారం నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 9 మందిని పట్టుకున్నారు. వీరిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా 9 మందికి రూ. 10,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌లో (అతిథి అధ్యాపకులు) బోధించడానికి గణిత ఉపాధ్యాయ నియామకానికి అర్హులైన అభ్యర్థులు బుధవారం పాఠశాలలో పూర్తి ధ్రువపత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్‌ సతీశ్‌ కుమార్‌ తెలిపారు. మ్యాథ్స్‌ బోధించడానికి ఎంఎస్సీ మ్యాథ్స్‌, బీఈడీ, టెట్‌ అర్హతతో అనుభవం కలిగిన అభ్యర్థులు పూర్తి బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement