వట్‌పల్లి(అందోల్): విద్యుత్ షాక్‌కు గురై ఒక రైతు మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అందోల్ మండలం రాంసాన్‌పల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతులు తలారి వెంకటేశం(38), మన్నె లక్ష్మయ్య(42)కు గ్రామ శివారులో పక్కపక్కనే భూమి ఉంది. సోమవారం వీచిన గాలిదుమారానికి బోరుబావులకు సరఫరా చేసే విద్యుత్ సర్వీస్ వైర్లు కట్టి నేలలో పాతిన కట్టె విరిగిపోయింది. దీంతో విద్యుత్ వైర్లు పొలంలో పడిపోయాయి. కాగా పొలంలో పడిన వైర్లను మళ్లీ పైకి లేపి కొత్త కట్టెను అమర్చేందుకు వారిద్దరూ కలిసి సాయంత్రం పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో పైకి లేపే క్రమంలో వెంకటేశం వైర్లను పట్టుకోగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కట్టెను పట్టుకున్న లక్ష్మయ్య కూడా షాక్ తగిలి దూరంగా ఎగిరిపడి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు గమనించి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మయ్యను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతుడు వెంకటేశం వ్యవసాయంతో పాటు పెయింట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
షటిల్ కాక్ తీసుకునేందుకు వెళ్లి..
పటాన్‌చెరు టౌన్: షటిల్ కాక్ తీసుకునేందుకు వెళ్లి యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటన జె.పి కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన గౌతం కుమార్(19) పారగాన్ పరిశ్రమలో కాంటాక్ట్ కార్మికుడుగా పని చేస్తూ.. బండ్లగూడలో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం షటిల్ ఆడుతుండగా కాక్ ఇంటిపై పడటంతో తీసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటిపై ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఎమ్మెల్యే సోదరుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్‌తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఒకరికి గాయాలు


