● ప్రారంభానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాలు
● అయోమయంలో రైతులు
వట్‌పల్లి(అందోల్): ఓ వైపు ఎల్‌నినో ప్రభావంతో సరిగా సాగునీరు అందక పంట ఎండిపోగా, మరోవైపు పండిన ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కాంటా వేయకపోవడంతో ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే వరి కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలుగా పోసి రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు నిర్వాహకుల నుంచి హామీ రాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, మిల్లర్లు పల్లెల్లో వాలిపోయి రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరను చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
మబ్బులతో రైతుల్లో ఆందోళన..
మొన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో రాశులుగా పోశారు. రెండు మూడు రోజులుగా మబ్బులు కమ్ముకోవడంతో పాటు జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు కురువడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు కుటుంబంతో సహా పగలు అక్కడే ఉండి, సాయంత్రానికి ఒక్కచోటికి చేర్చడంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


