సిద్దిపేటకమాన్: ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కావాలనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో శనివారం నిర్వహించిన మేధావుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితా విడుదల కాకముందే ఓట్లు గల్లంతయ్యాయని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నేత అని ఆయన సారథ్యంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శ చేసే కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుచుకుందో చెప్పాలని ప్రశ్నించారు. సర్ అనేది సాధారణ ప్రక్రియని చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఓట్లు తొలగించడానికి, కొత్త ఓట్లు చేర్చడానికి ఎన్నికల సంఘం చేస్తుందన్నారు. ఒక్క ఓటు కూడా నోటీసులు లేకుండా తొలగించరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): మండలంలోని కొత్తపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఎడపల రవి(44)శనివారం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి రాగానే తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కాగా జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిధర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌ల సంఘం మండల శాఖ అధ్యక్షుడు జగన్నాథం, గురుమూర్తిగౌడ్, లింగారెడ్డి, మల్లేశ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించి, నివాళులర్పించారు.
తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తట్టుకోలేక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విచారకర ఘటన మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈసూరి రామస్వామి (45) కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం కష్టాలు, అనారోగ్య బాధలు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది, తన ఇంటి వెనుక భాగంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


