పాపన్నపేట(మెదక్): కన్నపేగు తెంచుకు పుట్టిన శిశువుకు అమ్మ వెచ్చని పొత్తిళ్లు కరువయ్యాయి. ముళ్ల పొదలే దిక్కయ్యాయి. అభం శుభం తెలియని బిడ్డను.. రక్తపు మరకలు మానక ముందే ఓ తల్లి కర్కశంగా వదిలేయగా.. చీమలు పట్టి ఏడుస్తున్న ఆ బిడ్డను, గిరిజన మహిళలు అక్కున చేర్చుకొని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల కమాన్ వద్ద శనివారం చోటు చేసుకుంది. జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం.. పొడిచన్‌పల్లి తండాకు చెందిన బానోత్ కిశోర్ ఏడుపాయల కమాన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, పొలాల వద్ద ఉన్న గడ్డిలో మగ శిశువు ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ఆయనతోపాటు ఇంట్లోని మహిళలు అక్కడికి చేరుకొని, చీమలు పట్టిన శిశువును రక్షించారు. పాపన్నపేట పోలీసులకు, చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీకి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అంగన్‌వాడీ టీచర్ సుశీల, అధికారులు నాగరాజు, సరిత శిశువును చేరదీసి, వైద్యాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది, చిన్నారిని మెదక్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం బాగానే ఉందని, అప్పుడే పుట్టిన శిశువును తెల్లవారు జామున కమాన్ వద్ద వదిలేసి ఉంటారని డీడబ్ల్యూఓ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అంగన్‌వాడి టీచర్ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. శిశువును ఐసీపీఎస్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు.
అప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన తల్లి


