ఆర్టీసీ బస్సులో నగదు బ్యాగు చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో నగదు బ్యాగు చోరీ

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

● నిందితుడి అరెస్ట్‌

● రూ.9.50 లక్షలు స్వాధీనం

వెంకట్రావుపేట ఆలయాల్లో..

తొగుట(దుబ్బాక): మండల పరిధిలోని వెంకట్రావుపేటలో ఉన్న పలు దేవాలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆలయాల్లో శనివారం ఉదయం పూజ చేసేందుకు వెళ్లిన వారు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. శివారులో గల చౌడాలమ్మ దేవాలయం తలుపులు పగులగొట్టి అమ్మవారి మెడలోని పుస్తెమట్టెలు, హుండీని పగులగొట్టి అందులోని నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ దేవాలయాల తాళాలు పగులగొట్టి ఉన్నాయని, అక్కడ ఎలాంటి వస్తువులు అపహరించలేదని గ్రామస్తులు తెలిపారు.

పటాన్‌చెరు టౌన్‌: ప్రయాణికుడి బ్యాగులో ఉన్న రూ.10 లక్షల నగదును చోరీ చేసిన నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు, సీసీఎస్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. శనివారం ఏసీపీ శ్రీనివాస్‌ కేసు వివరాలు వెల్లడించారు. రామచంద్రాపురం పరిధిలోని అశోక్‌నగర్‌కు చెందిన ఎం.వెంకటరమణ (58) వ్యాపార నిమిత్తం కలబుర్గిలోని ఎస్‌బీఐ బ్యాంకు నుంచి నగదు, నాణేలు సేకరించి, ఈ నెల 28న సాయంత్రం కర్ణాటక ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. లింగంపల్లి వద్ద బస్సు దిగే సమయంలో తన బ్యాగు కనిపించకపోవడంతో అందులో ఉన్న రూ.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు ఈ నెల 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్ణాటక, కలబుర్గి జిల్లా చించోళి తాలూకా రాంశెట్టి నాయక్‌ తండాకు చెందిన ఉమేశ్‌ చవాన్‌(27)ను శనివారం రామచంద్రాపురం ఎస్‌ఎన్‌ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన రూ.9.50 లక్షల నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదించిన క్రైమ్‌ సిబ్బందిని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, శేరిలింగంపల్లి జోన్‌ డీసీపీ అభినందించారు.

చేను నుంచి 10 క్వింటాళ్ల పత్తి..

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పత్తి పంట చోరీకి గురైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. శనివారం బాధిత రైతు, స్థానికుల వివరాల ప్రకారం.. మద్దికుంట గ్రామానికి చెందిన రైతు బ్రహ్మానందరెడ్డి తనకున్న 4 ఎకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోతకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు చేనులోని 10 క్వింటాళ్ల పత్తిని తెంపుకొని తీసుకెళ్లారు. పత్తి లేకపోవడాన్ని రైతు చూసి లబోదిబోమన్నాడు. దీంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి ధర సుమారు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. కాగా దొంగిలించిన పత్తి విలువ దాదాపు రూ.90 వేల నుంచి లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement