జహీరాబాద్ టౌన్: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలని భావిస్తున్నాయి. స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు విరివిగా రుణాలు మంజూరు చేస్తూ పెద్దపీట వేస్తున్నాయి. బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి రుణాల ద్వారా ప్రభుత్వం రూ. కోట్లు మంజూరు చేస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది. దీనిని ఆసరా చేసుకొని కొందరు బోగస్ సంఘాలను ఏర్పాటు చేసి, బ్యాంకర్లతో కుమ్మకై రుణాలు తీసుకొని ఎగవేస్తున్నారు. ఈక్రమంలో ని ధులు దుర్వినియోగం కాకుండా ఖాతా వివరాల్లో పూర్తి పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రతి సభ్యురాలికి ఈ– కేవైసీ తప్పనిసరి చేసింది. ఎస్‌హెచ్‌జీ సభ్యుల సమగ్ర సమాచారం జాతీయ స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ‘లోకస్’ యాప్‌తో అనుసంధాన్నిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి, అనర్హులను తొలగించడమే లక్ష్యంగా వీఓఏలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ప్రతి సభ్యురాలి ఈ–కేవైసీని పూర్తి చేస్తున్నారు.
ఇప్పటివరకు 46 శాతం పూర్తి
జిల్లావ్యాప్తంగా 1,50,784 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యురాలికి ఈ–కేవైసీని గ్రామ సమాఖ్య సహాయకులు చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు జిల్లాలో 69,587 మంది సభ్యుల ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయింది. 46 శాతం లక్ష్యం నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సంఘాల వారీగా రుణాలు, చెల్లించిన వాయిదాలు, వడ్డీ రాయితీ, చేస్తున్న బిజినెస్ సమాచారం సెర్ప్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. ఈ–కేవైసీ పూర్తికావడం వల్ల నిధుల అవకతవకలకు అడ్డుకట్ట పడనుంది.
వివరాలు మ్యాచ్ అయితేనే..
ఆధార్ సమాచారం సరిగా లేకపోతే ఈ–కేవైసీ కావడం లేదని తెలిసింది. ఫోన్ నంబర్‌కు ఆఽధార్ లింక్ అయి ఉండాలి, ఫొటో కూడా సరిపోవాలి. ఆధార్‌లో ఉన్న ఐరీష్‌తో మ్యాచ్ అయితేనే ప్రక్రియ పూర్తివుతుంది. ఈ విధానంతో బోగస్ సభ్యులు ఉండే అవకాశం ఇకపై ఉండదు. అంతేకాకుండా ఒకరి స్థానంలో మరొకరు ఉండడం కూడా కుదరదు. సభ్యురాలిగా ఉన్నవారు మాత్రమే ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలను అధిగమించి ఈ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వీఓఏలను ఆదేశించారు.
నిధులకు ‘ఈ కేవైసీ’ రక్షణ
పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు
‘లోకస్ యాప్’లో వివరాల నమోదు


