వరి విత్తనోత్పత్తిపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వరి విత్తనోత్పత్తిపై అవగాహన

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అరుణ

హత్నూర(సంగారెడ్డి): వరి విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, జిల్లా కోఆర్డినేటర్‌ అరుణ అన్నారు. సోమవారం హత్నూర సొసైటీ ఆధ్వర్యంలో బోరపట్ల గ్రామంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. వరి విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన మెలకువలపై రైతులు ఎప్పటికప్పుడు అధికారులతో సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ధ్రువీకరించిన, వ్యవసాయ శాఖ అధికారులు ఎంపిక చేసిన వరి విత్తనాలను మాత్రమే రైతులు వేసుకోవాలన్నారు. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుంటూ సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో జోగిపేట రమాదేవి, సొసైటీ చైర్మన్‌ దుర్గారెడ్డి, సీఈఓ శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

వెల్దుర్తి(తూప్రాన్‌): మండలంలోని మంగళపర్తి గ్రామంలో రైస్‌ మిల్లు వద్ద రేషన్‌ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని సివిల్‌ సప్లై అధికారులకు అప్పగించారు. సోమవారం సివిల్‌ సప్లై ఇన్‌స్పెక్టర్‌ నర్సింలు ఘటనా స్థలాన్ని సందర్శించి వాహనంలో 6.60 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామం నుంచి మంగళపర్తి గ్రామానికి వాహనంలో రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్లు నిర్ధారించారు. వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు డ్రైవర్‌ తేజావత్‌ నవీన్‌పై కేసు నమోదు చేశారు.

డీజే వినియోగం..

కేసు నమోదు

పటాన్‌చెరు టౌన్‌: వినాయక నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ డీజే నిర్వహించిన వారిపై అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ప్రవీణ్‌ రెడ్డి వివరాల ప్రకారం.. బీరంగూడ ప్రభుత్వ పాఠశాల సమీపంలోని నరసింహ ఇంటి వద్ద మూడు డీజే వాహనాలను ఏర్పాటు చేసి అధిక శబ్దంతో సౌండ్‌ సిస్టమ్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కాగా డీజేలను ఈ నెల 27న సాయంత్రం 5 గంటల నుంచి 28న తెల్లవారుజామున 3.30 గంటల వరకు నిర్వహించారు. భారీ డిజిటల్‌ తెరలను రోడ్డుపై ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌తో, వాహనాల మళ్లింపు చేయాల్సి వచ్చింది. దీంతో డీజే వాహనాలు, యజమానులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకొని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నందారం నరసింహతో పాటు సంబంధిత డీజే యజమానులు, నిర్వాహకుల పై వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

ఏడు అక్రమ గ్యాస్‌ సిలిండర్లు సీజ్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): మండల కేంద్రంలోని విశ్వనాథ్‌ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలిండర్లను మెదక్‌ జిల్లా సివిల్‌ సప్లై అధికారి నర్సింహులు సీజ్‌ చేశారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 7 గ్యాస్‌ సిలిండర్లతో పాటు రీఫిల్లింగ్‌ పరికరాలు, వెయింగ్‌ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో బీపీసీకి చెందిన కమర్షియల్‌ ఖాళీ సిలిండర్‌ ఒకటి, డొమెస్టిక్‌ సిలిండర్లు మూడు, హెచ్‌పీసీకి చెందిన ఖాళీ సిలిండర్‌ ఒకటి, 5 కిలోల ప్రైవేట్‌ గ్యాస్‌ సిలిండర్లు రెండు ఉన్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను దేవి భారత్‌గ్యాస్‌ ఏజెన్సీ వద్ద భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement