సిద్దిపేటఅర్బన్: వినాయక నిమజ్జనం ఊరేగింపును తిలకిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసి 13 మందిని గాయపరిచింది. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వినాయక నిమజ్జనం ఊరేగింపును తిలకిస్తుండగా ఉన్న ట్టుండి అక్కడికి వచ్చిన కుక్క మొదటగా ఎనిమిది మందిని కరిచింది. అనంతరం మరో మండపం వద్ద ఆడుకుంటున్న నలుగురు చిన్నారులను గాయపరిచింది. అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మరో మహిళను వెంటాడి కరిచింది. గాయపడిన వారిలో ఒకరికి ముక్కు, మరొకరి చెవి, మరొకరి వేలుకు తీవ్ర గాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 13 మందిలో 8 మంది ఆస్పత్రిలో అడ్మిట్ కాగా మరో ఐదుగురికి ప్రాథమిక చికిత్స నిర్వహించి ఇంటికి పంపించారు. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులు, ఏడుగురు పెద్ద వారు ఉన్నారు.


