కొమురవెల్లి(సిద్దిపేట): గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఇటీవల శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో కవితా పోటీలను ఆంధరప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ పోటీల్లో కొమురవెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న జక్కుల శ్రీనివాస్ 176 మంది కవులతో పోటీపడి రాణించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసా పత్రం అందించారు. శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు రమేశ్, ఉపాధ్యాయులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, సత్యానారాయణతోపాటు పలువురు అభినందించారు.
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి నక్కా శ్రీనివాస్‌కు పీహెచ్‌డీ సాధించారు. ఔషధాల్లో నైట్రోసమైన్ ఔషధ పదార్థ సంబంధిత మలినాల గుర్తింపు, పరిమాణ నిర్ధారణకు విశ్లేషణాత్మక నాణ్యత, హరిత రసాయన శాస్త్ర సూత్రాల ఆధారంగా ఎల్‌సీ–ఎంఎస్ పద్ధతి అభివృద్ధిపై ఆయన పరిశోధన చేశా రు. సిప్రోఫ్లోక్సాసిన్, మోక్సిఫ్లోక్సాసిన్, ఏక్లోఫెనాక్, మెఫెనామిక్ యాసిడ్, టామ్సులోసిన్ తదితర ఔషధాల్లోని మలినాల సంశ్లేషణ, విషపూరితత, పరిమాణ నిర్ధారణపై అధ్యయనం చేశారు.
మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శిరబోయిన రిత్విక్ సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తున్నాడు. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో రిత్విక్ ప్రతిభ కనబరిచి బెస్ట్ ఆల్ రౌండర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కై వసం చేసుకున్నాడు. అలాగే జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్రలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు. వరుసగా రెండో ఏడాది కూడా జాతీయ స్థాయికి ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
చేర్యాల(సిద్దిపేట): ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నూతన కమిటీని పట్టణ కేంద్రంలో జరిగిన 5వ జిల్లా మహాసభల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రామగళ్ల నరేశ్, కార్యదర్శిగా జేరిపోతుల జనార్దన్, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్, రఘు, సహాయ కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, భరత్, కోశాధికారిగా రంజిత్, జిల్లా బాలికల కన్వీనర్‌గా శిరీష, కో–కన్వీనర్లుగా పూజ, యశ్విత, అంబికలను ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 11మంది కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు.
జహీరాబాద్ టౌన్: రౌడీషీటర్, పలు తీవ్ర నేరాల్లో నిందితుడు సయ్యద్ అబిద్ హుసేన్ అలియాస్ ‘అలీభాయ్’ (55)ను జహీరాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా... వ్యాపార భాగస్వామి ఉప్పరి నర్సింహను ఈ నెల 9న అలీభాయ్ తన అనుచరులతో కలిసి రైల్వే ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్నాడు. బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి బంధించి, డబ్బులు ఇవ్వకపోతే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరిస్తూ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అలీభాయ్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై గతంలో హైదరాబాద్, జహీరాబాద్‌లలో 9 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని సీఐ రవి తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్‌ఐ లవకుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు.


