సిద్దిపేటకమాన్: కిడ్నాప్, పోక్సో కేసులో నిందితుడికి సిద్దిపేట కోర్టు జైలు శిక్షతో పాటు, జరిమానా విధించింది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలానికి చెందిన నిందితుడు కొమ్ముగళ్ల బాలకృష్ణకు పట్టణానికి చెందిన ఓ బాలికతో గతంలో పరిచయం ఏర్పడింది. కాగా అతడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడగా 2018 జనవరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ నందీశ్వర్‌రెడ్డి దర్యాప్తు నిర్వహించి సాక్ష్యాధారాలను కోర్టులో దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.లక్షా 5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. నేరస్తుడికి శిక్షపడటంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు.
సిద్దిపేటరూరల్: ప్రేమలో విఫలమైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణరావుపేట మండలం శేఖర్‌రావుపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీరటి నాగరాజు(23) ఐటీఐ పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు మంగళవారం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దుబ్బాకటౌన్: కుటుంబ కలహాలతో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్ కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మర్కంటి యాదయ్య(62) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. తన పెద్ద కుమారుడు స్వామి, కోడలు సత్యలక్ష్మి మధ్య కొంతకాలంగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై నారాయణ తరుచూ బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చేగుంట(తూప్రాన్): కీటకాల నివారణకు సహజ పద్ధతిని పాటించాలని కేంద్రీయ సస్యరక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి హోన్నప్పగౌడ తెలిపారు. శుక్రవారం మండలంలోని అనంతసాగర్‌లో వరి పంటలపై పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటలో కీటకాలు నివారించేందుకు సహజ శత్రువుల (డిఫెండర్స్) గుర్తింపు ముఖ్యమన్నారు. రైతులు తమ వరి పోలాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, కీటకాలు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ రహిత సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం ద్వార స్థిరమైన వరి ఉత్పత్తిని సాధించవచ్చని రైతులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్, ఉపసర్పంచ్ శ్రీస్వామి, ఏఓ హరి ప్రసాద్, ఏఈఓ మాధవి, రైతులు పాల్గొన్నారు.


