యేడాదికి పది పంటలు.. అధిక లాభాలు
వరుసగా జిల్లా.. రాష్ట్ర అవార్డులు
నంగునూరు(సిద్దిపేట): పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక లాభాలు గడిస్తూ పట్టు సాగులో రా‘రాజుగా’ నిలుస్తున్నారు నంగునూరు మండలం ముండ్రాయి రైతు రాగుల రాజు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఒరవడిని అందిపుచ్చుకొని యేటా అధిక దిగుబడి సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈయేడాది ఉత్తమ రైతు అవార్డు అందజేసింది. భూసారం పెంచడం, సాగులో మెలకువలు, రైతులకు సూచనలు ఇస్తూ మార్గదర్శకంగా నిలవడంతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉత్తమ పట్టు రైతు అవార్డు అందజేసింది.
దుబాయ్ నుంచి వచ్చి..
బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లిన రాజు స్వగ్రామానికి వచ్చి తనకున్న మూడెకరాల భూమిలో సాగు చేస్తూ బోరు వేసి నష్టాలపాలు కాగా సీజన్ల వారీగా కూరగాయ పంటలు వేసి అప్పులపాలయ్యారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై అవగాహన పెంచుకొని సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి నూతన ఒరవడిని సృష్టించారు.
‘పట్టు’ సాధించి..
పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక లాభాలు వస్తాయని సెరీకల్చర్ అధికారి ఇంద్రసేనారెడ్డి, చంద్లాపూర్ రైతు అయిలయ్య, గంగాపూర్ రైతు షాదుల్లా ద్వారా తెలుసుకున్నారు. కూరగాయలు సాగు చేయగా భూమి విషతుల్యంగా మారడంతో బెల్లం, వేస్టేజ్ డీకామ్‌ప్రేసర్ నీటిని వదులుతూ క్రిమిరహిత నేలగా మార్చారు. భార్య లక్ష్మితో కలసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల సబ్సిడీతో షెడ్డు వేసి ఒక్కో ట్రేలో 30వేల లార్వా చొప్పున 20 ట్రేలలో పట్టు పురుగులు పెంచారు. నెలకు 2 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తూ అన్ని ఖర్చులు పోనూ.. ప్రతి నెలా రూ.50 వేలు ఆర్జిస్తున్నారు.


