మెదక్‌జోన్: సోషల్ మీడియాలో ప్రచారం, ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు యువకులు తప్పుడు దారి ఎంచుకుని, పోలీసులకు అడ్డంగా దొరికి కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు (23), చింతకింది శ్రీధర్ (23) ఫోన్‌లో పోస్టుచేసే వాటికి వ్యూస్ రావటంలేదని ఈ నెల 21, 22 తేదీల్లో అర్ధరాత్రి అలెగ్జాండర్ ఏపీహెచ్ గణపతన్న పేర్లతో ఎర్రటి వస్త్రంపై సుత్తి, కొడవళి గుర్తులను ఉంచి తూప్రాన్ పోలీస్‌స్టేషన్, మున్సిపాలిటీ ఆవరణలో ఎర్రటి వస్త్రంతో పాటూ లేఖలను పడేశారని ఎస్పీ తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా గాలించి సాంకేతిక పరిజ్ఞానంతో నింధితులను అదుపులోకి తీసుకుని విచారించగా యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో వ్యూస్‌కోసం ఈ పనిచేసినట్లు తెలిసిందన్నారు. వీరి పేరునా అలెగ్జండర్ పేరుతో ఇన్‌స్ట్రాగామ్, ఫవర్‌ఆఫ్‌మనీ పేరుతో యూట్యూబ్ ఉందని ఎస్పీ వివరించారు. గతంలో మేడారం జాతరలోనూ బెదిరింపు లేఖను రాసి అక్కడి ప్రభుత్వ కార్యాలయ గేటుకు కట్టారని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు మధుతో పాటూ అతనికి సహకరించిన శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు
ఇద్దరి యువకుల అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ


