చేర్యాల(సిద్దిపేట): ప్రజలకు మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులే ప్రజలకు సమస్య తెచ్చిపెట్టిన ఘటన పట్టణ పరిధిలోని 6వ వార్డులో చోటు చేసుకుంది. వార్డు పరిధిలో ఇటీవల నిర్మించిన డ్రైనేజీ, సీసీ రోడ్డు కాలనీవాసులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సీసీ రోడ్డు, నిర్మాణ సమయంలో వర్షపు నీరు కాలనీ నుంచి బయటకు వెళ్లేలా పైపులు ఏర్పాటు చేయాల్సిన కాంట్రాక్టర్ వాటిని ఏర్పాటు చేయకుండానే పనులు పూర్తి చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వర్షం కురిసిన ప్రతిసారి ఇళ్ల మధ్యలో వర్షపు నీరుటితో పాటు డ్రైనేజీ నీరు, చెత్తాచెదారం నిలిచిపోతున్నాయని వాపోతున్నారు. దీంతో దుర్గందం వ్యాపించడమే కాకుండా నిల్వ ఉన్న నీటిలో పాములు, తేళ్లు, విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన లేకుండా పనులు చేపట్టడం, సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేక పోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ఇప్పటికై నా పాలకవర్గం, అధికారులు స్పందించి నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
నివాసాల మధ్య
నిలిచిన వర్షపు నీరు


