నారాయణఖేడ్: ఖేడ్ మండలం పంచగామ పంచలింగేశ్వర ఆలయ గణనాథుడి లడ్డూ వేలంలో ఓ భక్తుడి నమ్మకం సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం నిర్వహించిన వేలంపాటలో కామారెడ్డి జిల్లా మాచాపూర్‌కు చెందిన రంగ సంగమేశ్వర్ ఏకంగా రూ.17,00,001 వెచ్చించి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. విశేషమేమిటంటే... ఆయన వరుసగా గత ఆరేళ్లుగా ఈ లడ్డూను పాడి సొంతం చేసుకుంటున్నారు. ఈ ప్రసాదం తీసుకున్నప్పటి నుంచి వ్యవసాయం, వ్యాపారంలో తనకు బాగా కలిసివస్తోందని, అందుకే ఎంత పోటీ ఉన్నా వెనకడుగు వేయకుండా లడ్డూను దక్కించుకుంటున్నానని ఆయన నమ్మకంతో తెలిపారు.
బొల్లారంలో రూ. 16.60 లక్షలు
జిన్నారం (పటాన్‌చెరు): ఉమ్మడి జిన్నారం మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాల పదో రోజు నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం పాటలు రికార్డు స్థాయిలో పలికాయి. బొల్లారం డివిజన్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డూను పులగుండ్ల సీతారాంరెడ్డి రూ.16.60 లక్షలకు దక్కించుకున్నారు.


