ప్రత్యేకాధికారి జగదీశ్
రాయికోడ్(అందోల్): విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అందులోభాగంగా శుభ్రమైన తాగునీరు అందించి పరిసరాల్లో పారిశుద్ధ్యలోపాలు లేకుండా చూడాలని మండల ప్రత్యేకాధికారి (జిల్లా బీసీ సంక్షేమాధికారి) జగదీశ్ ఉపాధ్యాయులకు సూచించారు. రాయికోడ్‌లోని మోడల్ స్కూల్ పరిసరాలను, బాలికల హాస్టల్‌ను, బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం తనిఖీ చేశారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు, విద్యాభ్యాసం ప్రాధాన్యతను వివరించారు. విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు అనారోగ్య బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా పాఠశాలలు, వసతి గృహాల్లో అందించే భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు ముందుగా రుచిచూసి విద్యార్థు లకు వడ్డించాలన్నారు. మోడల్ స్కూల్ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి పారిశుద్ధ్య పనులు చేయాలని పంచాయతీ కార్యదర్శి శివశంకర్‌ను ఆదేశించారు. బీసీ వసతి గృహం చుట్టూ నిర్మిస్తున్న ప్రహారీ గోడ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఎం.షరీఫ్, ప్రిన్సిపాల్ సురేందర్, వార్డన్ జానయ్య, విద్యార్థులున్నారు.


