సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, సతీశ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంభించడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి జీఓ 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కో కన్వీనర్ వాణి, జిల్లా కమిటీ సభ్యులు కేవీఎల్‌ఎన్ రెడ్డి, నాయకులు నిఖిల్, అభిషేక్, మణిస్వార్ రెడ్డి, హరి, కిరణ్, రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


