ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: ఆర్టీసీ మనుగడ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్ల నిధులు కేటాయించి ఆ సంస్థను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా పటాన్‌చెరు బస్ టెర్మినల్ ఆవరణలో శుక్రవారం మహిళా కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత రవాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలు నర్సింహారెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ..మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. అనంతరం మహిళలకు మిఠాయిలు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, డిపో మేనేజర్ ఇసాక్, వీరస్వామి, శ్రీనాథ్‌గౌడ్, కార్మిక నాయకులు రాజు, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు అక్షిత్, మహేశ్ పాల్గొన్నారు.
సంగారెడ్డి క్రైమ్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు అండర్–16 సెలక్షన్ ఈనెల 30న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్ తెలిపారు. సంగారెడ్డి జూబ్లీ క్లబ్ ప్రాంగణంలోని ఎమ్మెస్ క్రికెట్ మైదానంలో ఎంపిక నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్, బోనఫైడ్, 2 ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): మండలంలోని ఆయా ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల ఎన్‌ఈహెచ్‌ఎస్ పథకంలో భాగంగా హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య సహాయం కల్పించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈ ప్రక్రియను ఈ నెలఖారునాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో రెవె న్యూ, పంచాయతీ రాజ్, విద్య, వైద్య, వ్యవసాయ, అటవీ తదితర శాఖలకు సంబంధించిన ఉద్యోగులు తమ వివరాలతోపాటు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. హెల్త్ కార్డులకు నమోదుకు సమయం దగ్గర పడుతుండటంతో కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పోర్టల్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు.
అకడమిక్ క్యాలెండర్‌లో
విద్యార్థుల ఫొటో
నంగునూరు(సిద్దిపేట): నర్మేట పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రచురిస్తున్న అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలసి విద్యార్థులు దిగిన ఫొటోను ప్రచురించారు. మార్చి 22న నర్మేటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం, రాష్ట మంత్రులు వివేక్, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్ తోపాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్టాల్‌లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి, అల్పాహారంపై తీసుకున్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్టాల్‌ను పరిశీలించిన సీఎం, మంత్రులు, విద్యాశాఖ కమిషనర్, ఎంపీ రఘునందన్‌రావులు విద్యార్థులతో మాట్లాడి సంతోషంతో ఫొటో దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముద్రించిన క్యాలెండర్‌లో మార్చి 2027 నెల పేజీలో నాటి ఫొటోతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఫొటోకు చోటు దక్కింది.


