పారిశ్రామికవేత్తలకు మాత్రం భారీగా.. | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్తలకు మాత్రం భారీగా..

Aug 29 2026 7:15 AM | Updated on Aug 29 2026 7:15 AM

● ఖరీఫ్‌ సీజను దగ్గర పడుతున్నా పూర్తిస్థాయిలో అందని రుణాలు

● వార్షిక రుణ ప్రణాళిక రూ.3,181 కోట్లు

● ఇచ్చింది రూ.744 కోట్లే!

● సాగు ఖర్చులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన అన్నదాతలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈ ఆర్థిక ఏడాది 2026–27లో మొత్తం రూ.3,181 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ జూన్‌ నెలాఖరు నాటికి ఇచ్చిన రుణాలు కేవలం రూ.744 కోట్లే. అంటే నిర్దేశిత లక్ష్యంలో పావలా వంతు కూడా రుణం విదల్చలేదు. జూలైతోపాటు, ఈ ఆగస్టు మాసాల్లో ఇచ్చిన రుణాలు రూ.200 కోట్లకు మించి ఉండదని అంచనా. ఈ లెక్కన కూడా కనీసం 35% కూడా రుణాలు ఇవ్వలేదనేది స్పష్టమవుతోంది. వాస్తవానికి పంట వేసుకునేటప్పుడే రైతులకు రుణం అవసరం ఉంటుంది. విత్తనాలు, కూలీల ఖర్చులు, ట్రాక్టర్‌ కిరాయిలు, ఎరువులు ఇలా విత్తుకునే సమయంలోనే డబ్బుల అవసరం ఉంటుంది. కానీ కీలక సమయంలో బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో రైతులు చాలా మట్టుకు వడ్డీ వ్యాపారులను, ప్రైవేటు అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకుని ఈ వ్యాపారులు పెద్ద మొత్తంలో వడ్డీలు వసూలు చేయడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

పాత నివేదికలు.. మొక్కుబడి సమీక్షలు

బ్యాంకులు ఆయా రంగాలకు ఇస్తున్న రుణాల తీరును సమీక్షించేందుకు జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తుంటారు. ప్రతీ మూడు, నాలుగు నెలలకొకసారి ఈ సమావేశం కలెక్టరేట్‌లో జరుగుతుంది. ఆయా రుణాల జారీకి సంబంధించి అప్‌డేట్‌ నివేదికలను సమీక్షించాల్సింది. రెండు నెలల క్రితం నాటికి తయారైన నివేదికలపై సమీక్ష చేస్తుండటం చూస్తే ఈ సమావేశం ఎంత మొక్కుబడిగా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో రుణ మంజూరు నివేదిక జూన్‌ 30 నాటికే తయారు చేశారు. అంటే రెండు నెలల క్రితం నాటి నివేదికపై సమీక్ష చేయడం గమనార్హం. అప్‌డేట్‌ సమాచారంతో కూడిన నివేదికలపై సమీక్ష చేయాల్సిన అధికారులు కూడా బ్యాంకర్లు ఇచ్చిన నివేదికలను కనీసం పరిశీలించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బడాబాబులకు భారీగా రుణాలిచ్చే బ్యాంకర్లు అన్నదాతల పంట రుణాల విషయంలో తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. పంట రుణాల మంజూరులో బ్యాంకులు తమ నైజాన్ని చాటుకుంటున్నాయి. నిర్దేశిత లక్ష్యం మేరకు కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు.

అన్నం పెట్టే అన్నదాతకు రుణం ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపని బ్యాంకులు పారిశ్రామికవేత్తలకు మాత్రం విరివిగానే రుణాలిచ్చాయి. ఎంఎస్‌ఎంఈలో పేరుతో పారిశ్రామిక వేత్తలకు జూన్‌ నెలాఖరు నాటికే ఏకంగా రూ.1,580 కోట్లు ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ.3,703 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా..రెండు నెలల క్రితం వరకే నిర్దేశిత లక్ష్యంలో దాదాపు 43% మేరకు రుణాలు కట్టబెట్టారు. రైతులకు రుణాలిస్తే పర్సెంటేజీలు రావు..అదే పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రుణాల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement