● బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రజనీశ్
● ఐఐటీహెచ్‌లో ముగిసిన సైబర్ షీల్డ్ హ్యాకథాన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రోజురోజుకు కొత్త రూపం దాల్చుతున్న డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు బ్యాంకులు తమ సాంకేతిక సామర్థ్యాలను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో రజనీశ్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణల వ్యవస్థతో కలిసి పనిచేయడం ఎంతో అవసరమన్నారు. హైదారాబాద్ ఐఐటీలో రెండు రోజుల పాటు కొనసాగిన ‘సైబర్‌షీల్డ్ హ్యాకథాన్–2026’శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రజనీశ్ మాట్లాడుతూ...సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనే మార్గాలను అన్వేషించేందుకు ఇలాంటి హ్యాకథాన్‌లు ఎంతో అవసరమన్నారు. దేశవ్యాప్తంగా 2,936 మంది ఈ హ్యాకథాన్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 72 ఎంట్రీలను ఎంపిక చేశారు. 68 బృందాల్లో 232 మంది ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్నారు. హ్యాకథాన్ విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.ఐదు లక్షలు, రూ.మూడు లక్షలు, రూ.రెండు లక్షల నగదుతోపాటు, సర్టిఫికెట్లు అందజేశారు. పాల్గొన్నవారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటీ హైదరాబాద్, ఐడీఆర్‌బీటీ, సీడ్యాక్ తదితర సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


