సంగారెడ్డి జోన్: వానాకాలం సీజన్‌లో భాగంగా రైతులు సాగు చేసిన పంటల వివరాలు నమోదు ప్రారంభమైంది. గత మూడు రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులతోపాటు ప్రత్యేకంగా నియమించిన వలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ సాగు భూముల్లో ఏ పంట సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. పంట వివరాలు పూర్తిగా డిజిటల్ రూపంలోనే నమోదు చేయనున్నారు. గతేడాది పైలట్ ప్రాజెక్టులో భాగంగా క్లస్టర్ పరిధిలో ఉన్న రెండు గ్రామాలను ఎంపిక చేసి మహిళ ఏఈఓలకు 1,800 పురుషులకు 2 వేల ఎకరాలు పంటల వివరాలు నమోదు చేశారు. మిగతా ఎకరాలన్నీ మాన్యువల్‌గా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ ప్రస్తుతం 100% వివరాలన్నీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వే నంబర్ల ఆధారంగా జిల్లావ్యాప్తంగా 9 ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వలంటీర్లకు ఐడీలు
పంటల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డీసీఎస్(డిజిటల్ క్రాప్ సర్వే) యాప్‌ను రూపొందించింది. గతంలో ఏఈవోలు పంట నమోదుకు వ్యతిరేకించడంతో ఇందుకోసం ప్రత్యేకంగా వలంటీర్లను నియమించింది. వారందరికీ వేర్వేరుగా ఐడీలను కేటాయించి పిన్ నంబర్లను అందించింది. వాటి ద్వారా క్షేత్రస్థాయిలోకి వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రతీ గ్రామానికి ఒక వలంటీర్‌ను నియమించాల్సి ఉండగా ఇప్పటివరకు 560 మందిని ఎంపిక చేశారు. వీరిలో 329 మంది విధుల్లో చేరారు. మిగతావారు వలంటీర్‌గా విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.
రైతుకు ప్రయోజనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు పారదర్శకంగా రైతులకు చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పంట వివరాలు పక్కగా నమోదు చేయడంతో ఏ పంటలు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారో తేలనుంది. వీటి ఆధారంగా కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర, పంట నష్ట పరిహారం, తదితర ప్రయోజనాలు చేకూరనున్నాయి. పంట దిగుబడి అంచనాతో కొనుగోలు కేంద్రాలు, ధాన్యం పక్కదారి పట్టకుండా, దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేవిధంగా కసరత్తు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం
పంట నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం నాటికి జిల్లాలో ఇంకా 228 గ్రామాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభం కాలేదు. వివరాల సేకరణలో క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్రియ ప్రారంభంకాని గ్రామాలను గుర్తించి సంబంధిత డివిజన్, మండల, క్లస్టర్ అధికారులకు మెమోలు అందించి, వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే
ప్రత్యేకంగా వలంటీర్లు నియామకం
సర్వే నంబర్ల ఆధారంగా వివరాల సేకరణ
పంటల ఆన్‌లైన్ రికార్డుతో ప్రభుత్వ పథకాల అమలు


