● సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్
● వెల్కటూరులో ‘మన పోలీస్–మన ఊరు’ కార్యక్రమం
డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్న మెడికల్ కళాశాల విద్యార్థులు
సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటఅర్బన్: సిద్దిపేటను డ్రగ్, సైబర్ క్రైం రహిత జిల్లాగా మార్చడానికి ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ‘మన పోలీస్–మన ఊరు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీస్, విలేజ్ యూత్ మధ్య నిర్వహించిన వాలీబాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వర్షపు నీరు నిల్వ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను ప్రారంభించారు. పలు ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఎవరికి వారు తమ సొంత వ్యూహంతో పట్టుదలతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్‌ను కేవలం జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. చిన్న చిన్న గ్రామాల నుంచే పెద్ద పెద్ద విజయాలు సాధ్యమవుతాయని, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించాలని సూచించారు. ఆడపిల్లలపై ఎలాంటి వివక్ష చూపవద్దని, వారి కలలను, ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని కోరితే నమ్మవద్దని సూచించారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతకుముందు సురభి మెడికల్ కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై నృత్యప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్‌చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు, సర్పంచ్ బొల్లు లక్ష్మి, నాయకుడు బొల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు.


