తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 9:04 AM

● చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ ● బంగారం, వెండి, నగదు స్వాధీనం ● నిందితుడిపై 100కు పైగా కేసులు

● చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ ● బంగారం, వెండి, నగదు స్వాధీనం ● నిందితుడిపై 100కు పైగా కేసులు

జనగామ: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జనగామ పట్టణ పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై ఎం.భరత్‌తో కలిసి ఏసీపీ భీమ్‌ శర్మ కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన సయ్యద్‌ హమీద్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో నివాసముంటూ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28, 29వ తేదీల్లో బైక్‌పై హైదరాబాద్‌ నుంచి జనగామకు వచ్చాడు. ఈ క్రమంలో పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు, రైల్వే ట్రాక్‌ సమీపంలోని కాలనీలతో పాటు బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్‌ నగర్‌, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ సొత్తులో కొంత భాగం విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలతోపాటు జూదం, మద్యం తదితరాలకు ఖర్చు చేశాడు.

పెంబర్తి వద్ద చిక్కిన దొంగ..

కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జనగామ–పెంబర్తి బైపాస్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కాగా అనుమానాస్పదంగా కనిపించిన హమీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడి నుంచి సుమారు 47 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, రూ.5.60 లక్షల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, హమీద్‌పై గతంలో తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. కాగా నాచారం, సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ల పరిధిలో సదరు దొంగపై పీడీయాక్ట్‌ నమోదు చేసి జైలుకు సైతం పంపించారు. ఇటీవల కర్నాటకలోని గుల్బర్గా, అశోక్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను వరంగల్‌ సీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement